కలియుగ శ్రవణుడు.. తల్లిదండ్రులను కావడిలో మోస్తూ వందల కిలోమీటర్ల యాత్ర!

  • కావడి యాత్ర చేయాలని ఉందన్న తల్లిదండ్రులు
  • హరిద్వార్ తీసుకెళ్లి గంగలో స్నానం చేయించి యాత్ర ప్రారంభించిన కుమారుడు
  • 200 కిలోమీటర్ల దూరంలోని ఘజియాబాద్‌కు కావడిలో తీసుకెళ్తున్న వైనం
రామాయణం విన్న వారికి, చదివిన వారికి శ్రవణకుమారుడి గురించి, అతడి గొప్పతనం గురించి తెలిసే ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన వికాస్ గహ్లోత్‌ను చూసిన వారు ఇప్పుడు ‘కలియుగ శ్రవణుడు’ అని కీర్తిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిదండ్రుల కావడి యాత్ర ఆకాంక్షను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎండ, వానను లెక్కచేయకుండా తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. 

కావడి యాత్ర చేయాలని ఉందని తల్లిదండ్రులు చెప్పగానే మరోమాటకు తావులేకుండా సరేనన్న వికాస్.. వారితో కలిసి హరిద్వార్ చేరుకున్నాడు. అక్కడ గంగానదిలో స్నానమాచరించి పవిత్ర జలాన్ని సేకరించాడు. అక్కడి నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన కావడిలో తల్లిదండ్రులను కూర్చోబెట్టి 200 కిలోమీటర్ల దూరంలోని ఘజియాబాద్‌కు బయలుదేరాడు.

గంగాజలం నింపిన 20 లీటర్ల డబ్బాను తండ్రి వద్ద ఉంచాడు. ఆపై తన కష్టాన్ని తల్లిదండ్రులు చూడకుండా ఉండేందుకు వారి కళ్లకు గంతలు కట్టాడు. ఈ నెల 17న వికాస్ యాత్ర ప్రారంభమైంది. అతడికి అండగా ఇద్దరు స్నేహితులు కూడా వెంట నడిచారు. శనివారం ఈ యాత్ర మీరట్ చేరుకుంది. అక్కడ స్థానిక జిల్లా పంచాయతీ అధ్యక్షుడు గౌరవ్ చౌదరి, సిబ్బంది వారిని సన్మానించారు. తల్లిదండ్రుల కావడి యాత్ర కోరికను తీరుస్తున్న వికాస్‌ను అభినందించారు. అభినవ శ్రవణుడంటూ కొనియాడారు.



More Telugu News