నేత‌ల పిల్ల‌ల‌పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు వద్దు: కేటీఆర్‌

  • సోష‌ల్ మీడియా వేదిక‌గా టీఆర్ఎస్ శ్రేణుల‌కు కేటీఆర్ విజ్ఞ‌ప్తి
  • పిల్ల‌ల‌ను రాజ‌కీయ రొంపిలోకి లాగొద్ద‌ని సూచ‌న‌
  • సిద్ధాంతాలు, ప‌ని తీరు ఆధారంగానే వైరి వ‌ర్గాన్ని ఎదు‌ర్కొందామ‌ని పిలుపు
రాజ‌కీయ నేత‌ల పిల్ల‌ల‌పై వైరి వ‌ర్గాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమ‌వారం ఓ కీల‌క సూచ‌న చేశారు. రాజ‌కీయ విమ‌ర్శ‌ల నుంచి నేత‌ల పిల్ల‌ల‌ను మిన‌హాయిద్దామంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. పిల్ల‌ల‌ను ఆధారం చేసుకుని నేత‌ల‌ను టార్గెట్ చేయ‌డం ఎంత‌మాత్రం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం కాద‌ని ఆయ‌న సోమ‌వారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. 

ఇక‌పై రాజ‌కీయ నేత‌ల పిల్ల‌ల‌ను రాజ‌కీయ రొంపిలోకి లాగే దుష్ట సంస్కృతికి చ‌ర‌మ గీతం పాడ‌దామంటూ కేటీఆర్ త‌న సొంత పార్టీ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ నేత‌లు, పార్టీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు ఈ సంస్కృతికి స్వ‌స్తి చెప్పాల‌ని ఆయ‌న సూచించారు. వ‌ర్గ శ‌త్రువుల‌ను వారి సిద్ధాంతాలు, నిర్ణ‌యాలు, ప‌ని తీరు ఆధారంగానే విమర్శ‌లు చేద్దామ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.


More Telugu News