అందాలతో మంత్రముగ్ధులను చేస్తున్న జలపాతాలు ఇవే..!

  • తమిళనాడులోని హోగెనెక్కెల్ చూస్తే మరిచిపోలేరు
  • గోవాలోని దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ కూడా అంతే
  • కర్ణాటకలోని జాగ్ వాటర్ ఫాల్స్ ను ఒక్కసారైనా చూడాల్సిందే
ఎత్తయిన కొండలపై నుంచి పరుగులు పెడుతూ ప్రవహించే జలపాతాలు పర్యాటకుల మనసులను కట్టి పడేస్తుంటాయి. వాటి సందర్శన ప్రత్యేక అనుభూతిగా మిగిలిపోతుంది. అందుకే అందమైన జలపాతాలు ఎప్పుడూ సందర్శకులతో కిటకిట లాడుతుంటాయి. మన దేశంలో పెద్దగా తెలియని జలపాతాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ, వెలుగులోకి వచ్చి, పర్యాటకుల ఆదరణ, మనసు చూరగొంటున్నవి కొన్ని ఉన్నాయి. వీటి సందర్శనకు వర్షాకాలం అనువుగా ఉంటుంది. 

దూద్ సాగర్ వాటర్ ఫాల్స్
గోవాలోని మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోనే ఈ జలపాతం ఉంటుంది. దేశంలోని టాప్ వాటర్ ఫాల్స్ లో ఇది కూడా ఒకటి. 1,017 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు జారిపోతుంటుంది. చూడ్డానికి పాలపొంగులా ఉండడంతో దూద్ సాగర్ పేరు స్థిరపడింది. దేశంలో అత్యంత పొడవైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. పనాజి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

నోహ్కాలికై జలపాతం
మేఘాలయ రాష్ట్రం చిరపుంజికి 7.5 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరపుంజి కేంద్రమన్న సంగతి తెలిసిందే. 1,100 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కిందకు దూకుతుంటుంది. దేశంలో ఐదో ఎత్తయిన జలపాతం ఇది. దట్టమైన అటవీ ప్రాంతంలో అందాలు ఒలకబోస్తూ ఉంటుంది. రుతువులకు తగ్గట్టు ఇక్కడి నీరు బ్లూ, గ్రీన్, ఆక్వా రంగుల్లోకి మారిపోవడం మరో ప్రత్యేకత. షిల్లాంగ్ నుంచి 54 కిలోమీటర్లు ప్రయాణిస్తే దీన్ని చేరుకోవచ్చు.

అంబరిల్లా వాటర్ ఫాల్స్
వర్షాకాలంలో మాత్రమే కనిపించే ఈ జలపాతం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. విల్సన్ డ్యామ్ నుంచి నీరు పొంగి ప్రవహించినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తుంటుంది. 500 అడుగుల ఎత్తు నుంచి గొడుగు మాదిరి ఆకారంలో నీరు ప్రవహిస్తుంటుంది. ముంబై నుంచి 161 కిలోమీర్ల దూరంలో ఉంది.

చిత్రకూట్ జలపాతం
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. ఇంద్రావతి నది నుంచి వచ్చే నీటితో ఏర్పడింది. 90 అడుగుల ఎత్తుతో, 30 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. చాలా విశాలంగా ఉండడంతో భారత నయాగర ఫాల్స్ అన్న పేరు కూడా వచ్చింది. రాయ్ పూర్ నుంచి 289 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ చేరుకోలేము.

 తలకోన వాటర్ ఫాల్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు సమీపంలోనే ఉంది. తిరుపతి నుంచి 58 కిలోమీటర్ల దూరంలో.. తిరుపతి -  మదనపల్లె హైవేకు సమీపంలో ఉంది. 270 అడుగుల ఎత్తయిన కొండపై నుంచి నీటి ధారలు ఉరకలెత్తుతూ కనిపిస్తాయి. వర్షాకాలంలో ఇక్కడి అందాలు రెట్టింపవుతాయి. దట్టమైన అటవీ ప్రాంతం అదనపు ఆకర్షణ.

సనగాగర ఫాల్స్
ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో ఉంది. దీని పేరులో ఉన్నట్టుగా చిన్న జలపాతం, కానీ, ఆకర్షణీయంగా అనిపిస్తుంది. 100 మీటర్ల ఎత్తు నుంచి ఇది ప్రవహిస్తుంటుంది. చుట్టూ అందమైన ప్రకృతి మధ్య ఉండడంతో గుర్తింపునుకు నోచుకుంది. భువనేశ్వర్ నుంచి 224 కిలోమీటర్లు.

హొగెనెక్కల్ ఫాల్స్
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాలో ఉన్న ఈ జలపాతం చూడ్డానికి భిన్నంగా కనిపిస్తుంది. దేశంలో అత్యంత సుందర జలపాతాల్లో ఇది కూడా ఒకటి. తప్పకుండా సందర్శించాల్సిన ప్రాంతం. కర్ణాటక నుంచి తమిళనాడులోకి వచ్చే కావేరీ నదీ జలాలతో ఏర్పడింది. ఒకే జలపాతం 14 చానల్స్ గా ఉంటుంది. ఇక్కడి జలపాతంలో తొట్టిలాంటి పడవుల్లో సందడి చేయడం అనుభూతిగా మిగిలిపోతుంది. 

జాగ్ వాటర్ ఫాల్స్
829 అడుగుల ఎత్తయిన కొండలపై నుంచి పెద్ద ధారగా ఈ జలపాతం కనిపిస్తుంది. అత్యంత ప్రమాదరకమైంది కూడా. కనుక ఈ జలపాతాన్ని కొంచెం దూరంగా ఉండి చూడాల్సి ఉంటుంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. బెంగళూరు నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో కేఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తుంటుంది. దేశంలో అత్యంత సుందర జలపాతాల్లో ఇది కూడా ఒకటి.


More Telugu News