బీహార్ లో బాణసంచా వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు... ఆరుగురి మృతి

  • సరాన్ జిల్లా ఖుదాయి భాగ్ లో ఘటన
  • దాదాపు గంట పాటు పేలుళ్లు
  • సగం కూలిపోయిన ఇల్లు
  • శిథిలాల కింద క్షతగాత్రులు
ఓ బాణసంచా వ్యాపారి నివాసంలో భారీ పేలుడు జరగ్గా, ఆరుగురు మృత్యువాత పడిన ఘటన బీహార్ లోని సరాన్ జిల్లా ఖుదాయి భాగ్ లో  జరిగింది. బాణసంచా తయారుచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దాదాపు గంటసేపు పేలుళ్లు కొనసాగాయని స్థానికులు చెబుతున్నారు. 

పేలుడు ధాటికి ఇల్లు సగం కూలిపోయింది. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వ్యాపారి ఇంటివద్దకు చేరుకుని సహాయక చర్యలు షురూ చేశారు.


More Telugu News