పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే: రాజ్ నాథ్ సింగ్

  • జమ్మూలో 23వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం
  • అమరజవాన్ల కుటుంబ సభ్యులను కలుసుకున్న రాజ్ నాథ్
  • సైనికుల ప్రాణత్యాగాలను స్మరించుకున్న రక్షణమంత్రి
  • భారత్ ఇవాళ శక్తిమంతమైన దేశం అని వెల్లడి
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 23వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరజవాన్ల ప్రాణ త్యాగాలను స్మరించుకున్నారు. జమ్మూలో ఆయన అమరజవాన్ల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. బాబా అమర్ నాథ్ శైవక్షేత్రం భారత్ లో ఉంటే, సరిహద్దు నియంత్రణరేఖకు ఆవల శారదా మాత శక్తి పీఠం ఉండడం ఎలా కుదురుతుంది? అని ప్రశ్నించారు. పీవోకేపై పార్లమెంటులో తీర్మానం కూడా చేశారని, పాక్ ఆక్రమిత కశ్మీర్, కశ్మీర్ ఎప్పటికీ భారత్ లోనే ఉంటాయని అన్నారు. 

1962 నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు భారత్ అత్యంత శక్తిమంతమైన దేశాల్లో ఒకటని పేర్కొన్నారు. "1962లో లడఖ్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. ఆ సమయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మన ప్రధానిగా ఉన్నారు. ఆయన ఉద్దేశాలను నేను ప్రశ్నించడంలేదు. ఆయన ఆలోచనలు మంచివే అయ్యుండొచ్చు... కానీ, వాటిని దేశ విధానాలకు అనువర్తింపజేయలేం" అని రాజ్ నాథ్ వివరించారు.


More Telugu News