పతకాలు గెలవడం ఓకే...కానీ!: నీరజ్ చోప్రా

  • భారత్ కు దొరికిన క్రీడా ఆణిముత్యం నీరజ్ చోప్రా
  • టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం
  • తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో రజతం
  • ఎంత ఎదిగినా వినయవిధేయతలు ముఖ్యమన్న చోప్రా
తన జావెలిన్ త్రో నైపుణ్యంతో ప్రపంచ అథ్లెటిక్స్ రంగంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న క్రీడాకారుడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన 24 ఏళ్ల ఈ యువ అథ్లెట్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో రజతం సాధించి యావత్ భారతావని మరోసారి గర్వించేలా చేశాడు. జావెలిన్ త్రో ఫైనల్స్ ముగిసిన అనంతరం నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

దేశం కోసం పతకాలు గెలవడం గొప్ప విషయమే అయినా, వినయవిధేయతలతో ఉండడం, ఇతరులను గౌరవించడం అంతకంటే ముఖ్యమైన విషయం అని అభిప్రాయపడ్డాడు. 

"నువ్వు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నావు. వారి పట్ల ఎలా మసలుకుంటున్నావు అనేది ముఖ్యం. ఎవరైనా నీ పట్ల గౌరవం చూపితే, వారి పట్ల తిరిగి గౌరవం చూపాలని నీకు నువ్వు చెప్పుకోవాలి. ఇది ఎంతో అవసరం. అథ్లెట్ల కెరీర్ చాలా స్వల్పం. కొన్నేళ్లు క్రీడాకారుడిగా కొనసాగిన తర్వాత మళ్లీ సాధారణ జనజీవనంలోకి వెళ్లాల్సిందే. మనల్ని గౌరవించే వారిపట్ల గౌరవంగానే మాట్లాడాలి. కాళ్లు నేలపైన ఉండాలి" అని వ్యాఖ్యానించాడు.


More Telugu News