ప్రపంచ అథ్లెటిక్స్‌ రజత పతక విజేత నీరజ్‌పై మోదీ ప్రశంసలు

  • నీరజ్ చోప్రాపై కురుస్తున్న ప్రశంసల వర్షం
  • క్రీడల్లో భారత్‌కు చిరస్మరణీయమైన రోజన్న మోదీ
  • భవిష్యత్ టోర్నీలకు బెస్ట్ విషెస్ తెలిపిన ప్రధాని
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించిన భారత జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరిన నీరజ్ చోప్రా రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఫలితంగా ఈ క్రీడల్లో భారత్ తరపున పతకం అందుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కాడు. 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పథకం సాధించిన నీరజ్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. అత్యున్నత అథ్లెట్లలో నీరజ్ ఒకడని కీర్తించారు. భారత క్రీడల్లో ఇదో ప్రత్యేకమైన రోజని పేర్కొన్న మోదీ.. నీరజ్‌కు అభినందనలు తెలిపారు. అలాగే, భవిష్యత్ టోర్నీల్లోనూ పతకాలు సాధించాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలిపారు. 

మోదీతోపాటు పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా నీరజ్‌కు అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ తర్వాత అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పథకం సాధించినందుకు అభినందనలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఒలింపిక్స్ తర్వాత భారతీయులు పండుగ చేసుకునేందుకు మరో సందర్భం లభించిందన్నారు. అలాగే, కేంద్రమంత్రి కిరిణ్ రిజుజుతోపాటు ఏడీజీపీఐ ఇండియన్ ఆర్మీ కూడా నీరజ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసింది.


More Telugu News