బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై యథేచ్ఛగా దాడులు.. దేశవ్యాప్తంగా హిందువుల నిరసన

  • నరైల్‌లో హిందువుల ఇళ్లను తగలబెట్టిన దుండగులు
  • టీచర్ల హత్య, హిందూ మహిళలపై పెరిగిన అత్యాచారాలు
  • నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న బంగ్లాదేశ్ హోంమంత్రి
  • నివేదిక కోరిన మానవ హక్కుల సంఘం
బంగ్లాదేశ్‌లో హిందువులపై యథేచ్ఛగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ అక్కడి హిందువులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందూ సమాజంపై దాడి, హిందూ టీచర్ల హత్య, అత్యాచారాలకు వ్యతిరేకంగా చిట్టగాంగ్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో వేలాదిమంది హిందువులు పాల్గొన్నారు. నరైల్ సహపరాలో హిందువులపై జరిగిన అనాగరిక రాడికల్ జిహాదీ దాడికి నిరసనగా షాబాగ్ సహా దేశవ్యాప్తంగా వివిధ హిందూ సంస్థలు నిర్వహించిన ప్రదర్శనలు శాంతియుతంగా జరిగినట్టు హిందు సంగ్‌బాద్ అనే బంగ్లాదేశ్ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 

మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ హెచ్చరించారు. హిందువులపై జరుగుతున్న వరుస దాడులపై స్పందించిన బంగ్లాదేశ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది. వీటిపై విచారణ జరిపి దాడులను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం ఉందో, లేదో తేల్చాలని హోంమంత్రిత్వశాఖను ఆదేశించింది. ఇస్లాంను దూషిస్తున్నారన్న పుకార్ల నేపథ్యంలోనే హిందువులపై దాడులు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నెల 15న నరైల్‌లోని సహపరా ప్రాంతంలో హిందువుల ఇళ్లను కొందరు తగలబెట్టారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల కుర్రాడు ఫేస్‌బుక్‌లో ఇస్లాంకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనకు పాల్పడినట్టు దుండగులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.


More Telugu News