వీడ్కోలు కార్యక్రమంలో సందేశం వినిపించిన రామ్ నాథ్ కోవింద్

  • రేపటితో ముగియనున్న కోవింద్ పదవీకాలం
  • పార్లమెంటు సెంట్రల్ హాల్ లో వీడ్కోలు కార్యక్రమం
  • రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరగాలన్న కోవింద్
  • పక్షపాత రాజకీయాలు విడనాడాలని పిలుపు
భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవింద్ తన సందేశాన్ని వెలువరించారు. రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. జాతీయ ప్రయోజనాల కోసం పక్షపాత రాజకీయాలను అధిగమించాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమానికి ఏది అవసరమో నిర్ణయించుకోవాలని రాజకీయ పక్షాలకు సూచించారు. 

పార్లమెంటును 'ప్రజాస్వామ్య దేవాలయం' అని అభివర్ణించారు. ఉభయ సభల్లో చర్చలు జరిపేటప్పుడు సభ్యులు గాంధేయవాదాన్ని అనుసరించాలని రామ్ నాథ్ కోవింద్ హితవు పలికారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఆమె మార్గదర్శనంలో దేశం లబ్ది పొందాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, ఈ వీడ్కోలు కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు.


More Telugu News