మీడియాపై విమర్శలు గుప్పించిన సీజేఐ ఎన్వీ రమణ

  • పక్షపాతం, అజెండా ఆధారంగా నడుస్తున్నాయన్న జస్టిస్ ఎన్వీ రమణ
  • ఎలక్ట్రానిక్ మీడియాకు జవాబుదారీతనం లేదని వ్యాఖ్య
  • సోషల్ మీడియా మరింత అధ్వానంగా ఉందని విమర్శ
మీడియా సంస్థలు తమ డిబేట్లలో కంగారు కోర్టులు (సరైన ఆధారాలు లేని అనధికార కోర్టులు)గా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఇంకా దారుణంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అవగాహన లేమితో కూడిన సమాచారం, పక్షపాతం, ఒక అజెండా ఆధారంగా వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని అన్నారు. జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని చెప్పారు. 

మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ... ఏది మంచో, ఏది చెడో నిర్ధారించలేకపోతున్నాయని అన్నారు. ఈ పరిణామాలతో ఎంతో అనుభవం ఉన్న న్యాయమూర్తులకు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టమవుతోందని చెప్పారు. అవగాహన లేకుండా లేదా ఒక స్వార్థపూరితమైన అజెండాతో వ్యాపింపజేసే అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని అన్నారు. 

బాధ్యతను అతిక్రమించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మీడియా రెండడుగులు వెనక్కి తీసుకెళ్తోందని చెప్పారు. అయితే, కొంత స్థాయి వరకు ప్రింట్ మీడియా బాధ్యతతో వ్యవహరిస్తోందని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు ఏమాత్రం జవాబుదారీతనం లేదని విమర్శించారు. సోషల్ మీడియా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, కానీ విధి తనకు మరో దారి చూపించిందని చెప్పారు. న్యాయమూర్తి అయినందుకు తాను బాధపడటం లేదని అన్నారు.


More Telugu News