జీఎస్టీ కారణంగా భారంగా మారనున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం

  • ఆసుపత్రుల్లో రూ.5,000కు మించిన రూమ్ రెంట్ పై 5 శాతం జీఎస్టీ
  • దీనివల్ల పాలసీదారులు, బీమా సంస్థలపై అదనపు భారం
  • దీంతో బీమా సంస్థలు ప్రీమియం పెంపు బాట పట్టే అవకాశం
అదేంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఇప్పటికే 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంది, దాన్ని పెంచకుండా ప్రీమియం ఎలా భారం అవుతుంది? అన్న సందేహం వచ్చి ఉంటుంది. నిజమే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ పెంచలేదు. 18 శాతం జీఎస్టీ చాలా ఎక్కువని, దీన్ని ఎత్తివేయాలని కూడా పరిశ్రమ కోరుతోంది. కానీ, ఈ నెల 18 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ నూతన రేట్ల వల్లే తాజా పరిణామమని చెప్పుకోవాలి. ఆసుపత్రుల్లో రూ.5,000కు మించి రోజువారీ చార్జీ చేసే రూమ్ రెంట్ /పడకలపై 5 శాతం జీఎస్టీని జీఎస్టీ కౌన్సిల్ అమల్లోకి తీసుకొచ్చింది. 

కనుక ఆసుపత్రుల్లో రోజువారీ రూ.5,000కు మించి చార్జీలు పడే గదుల్లో వైద్యం పొందిన వారికి అదనంగా ఈ భారం పడనుందని నిపుణులు చెబుతున్నారు. బిల్లు మొత్తంపై ఇది ప్రతిఫలిస్తుందని అంటున్నారు. ఆసుపత్రుల్లో అయ్యే బిల్లులో 15-20 శాతం రూమ్ రెంట్ చార్జీలే ఉంటాయని, కనుక బీమా సంస్థలు అధికంగా చెల్లించాల్సి వస్తుందని, దీంతో అవి ప్రీమియం రేట్లు పెంచుతాయని విశ్లేషణ వ్యక్తమవుతోంది.

హెల్త్ పాలసీల్లో రూమ్ రెంట్ కు పరిమితులు ఉంటాయి. రోజువారీ షేర్డ్ రూమ్ లేదా సింగిల్ రూమ్ ఇలా పరిమితులు ఉన్న ప్లాన్ తీసుకుని, అంతకుమించి చార్జీ పడే పడకలు తీసుకుంటే, అదనంగా పడే మేరకు పాలసీదారు భరించాల్సి ఉంటుంది. రూమ్ రెంట్ ఉప పరిమితులు ఉన్న వారిపై తాజా జీఎస్టీ 5 శాతం రూపంలో నేరుగా భారం పడనుంది. రూమ్ రెంట్ పరంగా ఎటువంటి పరిమితుల్లేని ప్లాన్లకు బీమా కంపెనీలే పూర్తిగా చెల్లిస్తాయి. కనుక వాటిపై భారం పెరుగుతుంది. వెరసి అంతిమంగా కస్టమర్లు చెల్లించే ప్రీమియంలో ఇది ప్రతిఫలించనుంది.


More Telugu News