ఐదో అంతస్తు నుంచి పడిపోయిన చిన్నారి.. బంతిలా క్యాచ్ పట్టి కాపాడిన వ్యక్తి

  • చైనాలోని టోంగ్జియాంగ్ లో జరిగిన ప్రమాదం
  • కిటికీ నుంచి జారి పడిపోయిన రెండేళ్ల పాప
  • కారు పార్కింగ్ చేస్తూ కేకలు విన్న యువకుడు
  • వేగంగా పరుగెత్తుకొచ్చి పట్టుకోవడంతో దక్కిన పాప ప్రాణాలు
మన చుట్టూ అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. వీటినే మిరాకిల్స్ గా చెబుతుంటారు. ఇక్కడ కూడా అలాగే, రెండేళ్ల చిన్నారి ఐదో అంతస్తు నుంచి కింద పడిపోతుంటే, ఓ ఇద్దరు వచ్చి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన చైనాలోని జెంజియాంగ్ ప్రావిన్స్ పరిధిలోని టోంగ్జియాంగ్ లో చోటు చేసుకుంది. 

షెన్ డాంగ్ అనే యువకుడు వీధి పక్కన తన కారును పార్క్ చేస్తున్నాడు. అదే సమయంలో పెద్దగా కేకలు వినిపించాయి. పక్కగా చూస్తే ఎత్తయిన భవనం (ఐదో అంతస్తు) కిటికీ నుంచి ఓ చిన్న పాప కిందకు జారి పడిపోతోంది. దీంతో షెన్ డాంగ్, అతడి భార్య వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చి రెండు చేతులు చాచి పాపను పట్టుకున్నారు. కిటికీ నుంచి పడిపోతున్న సమయంలో ముందుగా ఆ చిన్నారి ఒక స్టీల్ రూఫ్ మీద పడింది. అక్కడి నుంచి క్షణాలలో మళ్లీ కిందకు జారింది. పెద్దగా కేకలు వేయడం, వాటిని విన్న షెన్ డాంగ్ దంపతులు వేగంగా స్పందించడంతో పాప ప్రాణాలు దక్కాయి. 

దీంతో షెన్ డాంగ్ నిజమైన హీరో అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన హీరోలు సినిమాల్లోకాదు, నిజ ప్రపంచంలోనే ఉంటారంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టడం గమనార్హం.


More Telugu News