తనయుడి కోసం త్యాగం... ప్రత్యక్ష రాజకీయాలకు యడియూరప్ప గుడ్ బై!

  • షికారిపుర స్థానాన్ని వదులుకుంటున్నట్టు యెడ్డి ప్రకటన
  • తన కుమారుడు విజయేంద్రను గెలిపించాలని విజ్ఞప్తి
  • తనకంటే అత్యధిక మెజారిటీ అందించాలన్న మాజీ సీఎం
  • ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న విజయేంద్ర
కర్ణాటక రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రత్యక్ష రాజకీయాలకు పరోక్షంగా వీడ్కోలు పలికారు. షికారిపుర నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు బీవై విజయేంద్ర బరిలో దిగుతాడని యడియూరప్ప వెల్లడించారు. 

విజయేంద్ర ప్రస్తుతం కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కుమారుడి కోసం తాను షికారిపుర నియోజకవర్గాన్ని వదులుకుంటున్నానని యడియూరప్ప వెల్లడించారు. తనను గెలిపించినట్టుగానే తన కుమారుడ్ని కూడా అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి పంపాలని షికారిపుర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తాను గతంలో పొందిన దానికంటే ఎక్కువ మెజారిటీని తన కుమారుడికి అందించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని తెలిపారు. 

షిమోగా జిల్లాలోని షికారిపుర నియోజకవర్గంతో యడియూరప్పకు దశాబ్దాల అనుబంధం ఉంది. 1983 నుంచి ఆయన ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. షికారిపుర నుంచి 8 పర్యాయాలు  గెలిచిన ఆయన, 1999లో మాత్రం ఒక్కసారి ఓడిపోయారు. ఇప్పుడు షికారిపుర ప్రజలు తన రెండో కొడుకును కూడా ఆదరిస్తారని ఆయన బలంగా నమ్ముతున్నారు.


More Telugu News