లలిత్ మోదీ ఎక్కడున్నాడో సుస్మితా సేన్ కనుగొంది కానీ, ప్రధాని మోదీ కనుగొనలేకపోయారే!: ఆప్ నేత వ్యంగ్యం

  • ఇటీవల ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్
  • తాజాగా మనీశ్ సిసోడియాపై ఆరోపణలు
  • స్పందించిన ఆప్ నేత సంజయ్ సింగ్
  • కేజ్రీ సర్కారు నిజాయతీని చూసి కేంద్రం భయపడుతోందని వ్యాఖ్య
ఐపీఎల్ లో అవకతవకలతో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ ఇటీవలే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తో చెట్టాపట్టాలేసుకుని కనిపించింది. అద్భుతం అనదగ్గ రీతిలో ఐపీఎల్ ను ప్రపంచానికి పరిచయం చేయడం వెనుక మాస్టర్ మైండ్ లలిత్ మోదీనే. కానీ, లీగ్ లో ఆర్థిక అవకతవకలు ఆయన పేరుప్రతిష్ఠలను మసకబార్చాయి. ఆయన కోసం భారత్ లో దర్యాప్తు సంస్థలు ఎదురుచూస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, లలిత్ మోదీ-సుస్మితా సేన్ ల అఫైర్ ను ప్రస్తావిస్తూ ఆప్ నేత సంజయ్ సింగ్ కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'లలిత్ మోదీ ఎక్కడున్నాడో సుస్మితా సేన్ కనుగొంది కానీ, మోదీ సర్కారు మాత్రం కనిపెట్టలేకపోయింది' అంటూ ఎద్దేవా చేశారు. ఆప్ మంత్రి మనీశ్ సిసోడియాపై మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ విచారణకు కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో సంజయ్ సింగ్ పైవిధంగా స్పందించారు. 

కేజ్రీవాల్ ప్రభుత్వ చిత్తశుద్ధిని, నిజాయతీని చూసి మోదీ సర్కారు భయపడుతోందని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తప్పుడు ఆరోపణలతో ఆప్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ ను ఇలాగే అరెస్ట్ చేశారని, ఇప్పుడు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను టార్గెట్ చేశారని సంజయ్ సింగ్ మండిపడ్డారు.


More Telugu News