తమకు సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదు: చంద్రబాబు కోనసీమ పర్యటనపై సజ్జల వ్యాఖ్యలు

  • కోనసీమ జిల్లాకు వరద పోటు
  • జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • వెళ్లింది పరామర్శకా, ప్రచారానికా? అంటూ సజ్జల విమర్శలు
  • చంద్రబాబు చెప్పేది అబద్ధమని తేలిందని వ్యాఖ్యలు
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఆయన స్పందించారు. వరద బాధితులకు ఎలాంటి సహాయం అందలేదని నిరూపించడమే ఆయన పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశమని సజ్జల ఆరోపించారు. కానీ, తమకు సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని వెల్లడించారు. దాంతో చంద్రబాబు చెప్పేది అబద్ధమని స్పష్టంగా తేలిపోయిందని అన్నారు. 

పరామర్శ కంటే ప్రచారానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. "అసలు చంద్రబాబు వెళ్లింది దేనికి? వరద పర్యటనకా? ప్రచారానికా? పచ్చి అబద్ధాలను చెబుతూ వెళ్లారు. చంద్రబాబు జీవితమే ఓ అబద్ధమైపోయింది. నాడు టీడీపీ హయాంలో విపత్తులు వస్తే ఒక్కసారైనా తక్షణ సాయంగా పైసా ఇచ్చాడా? చీపురు పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం తప్ప ఏమీ చేయలేదు. మీడియాలో కనిపించాలన్న యావ చంద్రబాబును ఈ విధంగా తయారుచేసింది. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని ఇవాళ ప్రజలెవరూ నమ్మడంలేదు" అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు.


More Telugu News