విజయవాడలో కుండపోత వాన... మునిగిన లోతట్టు ప్రాంతాలు
- ఏకంగా మూడు గంటల పాటు భారీ వర్షం
- చెరువుల్లా మారిన ప్రధాన రహదారులు
- రోడ్లపై రెండడుగుల మేర నీరు
- వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు
విజయవాడ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఏకబిగిన మూడు గంటల పాటు కురిసిన వానతో నగరం జలమయమైంది. ప్రధానరోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై రెండు అడుగుల మేర నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంజీ రోడ్, లబ్బీపేట, మొగల్రాజపురం, కృష్ణలంక, ఏలూరు రోడ్, రెవెన్యూ కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. రాష్ట్రంలో మరో రెండు మూడ్రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావం రాష్ట్రంపై ఉందని వెల్లడించింది.