బీజేపీ నేతలు వివేక్, అరుణతారల అరెస్ట్ పై భగ్గుమన్న బండి సంజయ్

  • కామారెడ్డి జిల్లాలో బీజేపీ నేతల అరెస్టులు
  • పోలీసులు టీఆర్ఎస్ నేతలకు కొమ్ముకాస్తున్నారన్న సంజయ్
  • వెంటనే బీజేపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ ను, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు అరుణతారను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ మూకలు బరితెగించి దాడికి పాల్పడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. 

బీజేపీ నేతలపై దాడులు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, టీఆర్ఎస్ నేతలకు కొమ్ముకాస్తూ బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. అరెస్ట్ చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్ సర్కారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

బీజేపీ జెండాను చూస్తేనే టీఆర్ఎస్ నేతలు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా గోస-బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలతో గ్రామాల్లోకి వెళుతూ ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేస్తున్న బీజేపీ శ్రేణులను ప్రజలు ఆదరిస్తుండడంతో టీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.


More Telugu News