ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు షాకిచ్చిన మమతా బెనర్జీ

  • విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు సరిగా లేదన్న టీఎంసీ   
  • తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటింగ్ కు దూరంగా ఉంటారని ప్రకటన
  • ఆగస్ట్ 6న ఉప రాష్ట్రపతి ఎన్నికలు
భారత రాష్ట్రపతి ఎన్నికల పర్వం పూర్తయింది. ఎన్డీయే మద్దతిచ్చిన అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికలకు తెరలేచింది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉంటున్నట్టు టీఎంసీ ప్రకటించింది. ఈ ఓటింగ్ కు తమ పార్టీ దూరంగా ఉంటుందని మమత మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.

టీఎంసీతో సంబంధం లేకుండా విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించిన తీరు సరిగా లేదని... అందుకే, తాము విపక్షాల అభ్యర్థికి మద్దతును ఇవ్వబోమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దూరంగా ఉంటారని తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున జగదీప్ ధన్కడ్, విపక్షాల తరపున మార్గరెట్ అల్వా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 6న ఓటింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్ట్ 10న ముగియనుంది.


More Telugu News