ప్రాణం పోయింద‌నుకున్నా!: ప‌డ‌వ ప్ర‌మాదంపై దేవినేని ఉమ

  • వ‌ర‌ద ప్రాంతాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌
  • ప‌డ‌వ మారబోతుండ‌గా ఒరిగిన నేత‌ల ప‌డ‌వ‌
  • న‌దిలో ప‌డిపోయిన దేవినేని, పితాని త‌దిత‌రులు
  • దేవుడి ఆశీస్సుల‌తోనే బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాన‌న్న దేవినేని
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం సాయంత్రం ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా ప‌రిధిలోని సోంప‌ల్లి స‌మీపంలో ఓ ప‌డ‌వ నుంచి టీడీపీ నేత‌లు మ‌రో ప‌డ‌వ‌లోకి మారుతున్న స‌మ‌యంలో వారున్న ప‌డ‌వ ఓ వైపున‌కు ఒరిగిపోయింది. 

దీంతో మాజీ మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, పితాని స‌త్య‌నారాయ‌ణ‌, ఉండి ఎమ్మెల్యే రామ‌రాజు, త‌ణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ‌లు గోదావ‌రిలో ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే వారికి స‌మీపంలోనే ఉన్న మ‌త్స్య‌కారులు వెనువెంట‌నే రంగంలోకి దిగి టీడీపీ నేత‌ల‌ను సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ, నీటిలో ప‌డ‌గానే ఊపిరి ఆడ‌క ఉక్కిరిబిక్కిరి ఆయ్యాన‌ని, ప్రాణం పోయింద‌ని భావించాన‌ని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సుల‌తోనే తాను బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేవినేనితో పాటు గోదావ‌రిలో ప‌డిపోయిన నేత‌లు కూడా తీవ్ర భ‌యాందోళ‌న‌లకు గుర‌య్యారు. అయితే ప్ర‌మాదం ఒడ్డుకు అత్యంత స‌మీపంలోనే జ‌ర‌గ‌డంతో వారికి ఎలాంటి ముప్పు వాటిల్ల‌లేదు.


More Telugu News