బరువు తగ్గితే కోట్లు సంపాదించవచ్చు... టీమిండియా క్రికెటర్ కు సూచించిన అక్తర్

  • ఇటీవల విశేషంగా రాణిస్తున్న రిషబ్ పంత్
  • ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన వైనం
  • పంత్ ఒంటిచేత్తో వన్డే సిరీస్ గెలిపించాడన్న అక్తర్
  • పంత్ చూడ్డానికి బాగుంటాడని కితాబు
  • మోడల్ గా రాణించే అవకాశాలున్నాయని వెల్లడి
టీమిండియా క్రికెటర్లపైనా, భారత క్రికెట్ కార్యకలాపాలపైనా ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచే పాకిస్థాన్ పేస్ దిగ్గజం షోయబ్ అక్తర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఇంగ్లండ్ పై సంచలన ఇన్నింగ్స్ తో టీమిండియాకు వన్డే సిరీస్ లో విజయాన్నందించిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై ప్రశంసలు జల్లు కురిపించాడు. 

ఈ యువ క్రికెటర్ ఏమాత్రం భయంలేకుండా ఆడతాడని కొనియాడాడు. పంత్ అమ్ములపొదిలో కట్ షాట్, పుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, ప్యాడిల్ స్వీప్ వంటి వైవిధ్యభరితమైన షాట్లు ఉన్నాయని, వాటితో ప్రత్యర్థి జట్లను కష్టాల్లోకి నెడతాడని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ ను పంత్ ఒంటిచేత్తో గెలిపించాడని అక్తర్ కితాబునిచ్చాడు. 

అయితే, పంత్ కాస్త అధిక బరువుతో కనిపిస్తున్నాడని, దానిపై అతడు దృష్టి పెడతాడని భావిస్తున్నట్టు అక్తర్ తెలిపాడు. ఎందుకంటే భారత మార్కెట్ చాలా పెద్దదని, ఆకర్షణీయంగా ఉండే పంత్ మోడల్ గా రాణించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డాడు. పంత్ మోడలింగ్ ద్వారా కోట్లు సంపాదించుకోవచ్చని, భారత్ లో ఎవరైనా సూపర్ స్టార్ అయిపోతే అతడిపై భారీగా పెట్టుబడులు పెడుతుంటారని వివరించాడు. ఆ విధంగా పంత్ ముందు మంచి అవకాశం నిలిచి ఉందని అక్తర్ తెలిపాడు.


More Telugu News