ఆ వార్తలన్నీ అవాస్తవం... నేను ఆ లీగ్​లో ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ

  • ఈ సెప్టెంబర్ లో లెజెండ్స్ లీగ్ రెండో ఎడిషన్
  • బరిలో సెహ్వాగ్, హర్భజన్, మురళీ ధరన్ తదితరులు
  • తాను కూడా పోటీ పడతానన్న వార్తలను ఖండించిన గంగూలీ
కెరీర్ కు వీడ్కోలు పలికిన క్రికెటర్లతో ఏర్పాటు చేసిన లెజెండ్స్ క్రికెట్ లీగ్ తొలి సీజన్ మంచి సక్సెస్ సాధించింది. దాంతో, ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే రెండో ఎడిషన్‌పై అందరి దృష్టి ఉంది. ఈ సీజన్ లో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లీగ్ లో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో, లీగ్ కు స్టార్ అట్రాక్షన్ వచ్చేసింది.
 
ఇక, ఈ సీజన్లో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా పాల్గొంటారన్న వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ మరోసారి మైదానంలోకి వస్తే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ వార్తలపై దాదా స్పందిస్తూ.. లెజెండ్స్ లీగ్ లో తాను పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు. ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అన్నాడు.  

గంగూలీ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్న దాదా  2015లో అమెరికాలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ల్లో చివరగా పోటీ పడ్డాడు. చాలా మంది రిటైర్డ్ ప్లేయర్లు ‘రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్’ ఇతర లీగ్‌లలో ఆడుతున్నప్పటికీ, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ తన బాధ్యతలకు మాత్రమే కట్టుబడి ఉన్నాడు.


More Telugu News