బోర్ కొట్టేసిందంటూ.. అనూహ్య నిర్ణయం తీసుకున్న వరల్డ్ చెస్ చాంపియన్!

  • వరల్డ్ చెస్ చాంపియన్ లో ఇక ఆడబోనని కార్ల్ సన్ ప్రకటన
  • వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ గా కార్ల్ సన్
  • మ్యాచ్ ఆడేందుకు అవసరమైన ప్రేరణ లభించడంలేదని వెల్లడి
  • ప్రతిసారీ తానే గెలుస్తుండడంతో విసుగొస్తోందని వివరణ
చదరంగం క్రీడలో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇకమీదట వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనబోనని స్పష్టం చేశాడు. అందుకు కారణం... ఆసక్తి లేకపోవడమేనట. మరో మ్యాచ్ ఆడేందుకు అవసరమైన ఉత్తేజం కలగడంలేదని చెబుతున్నాడు. ప్రతిసారి తనే విజయం సాధిస్తుండడంతో ఆటను ఆస్వాదించలేకపోతున్నానని, విసుగు వస్తోందని ఈ నార్వే చెస్ దిగ్గజం  వెల్లడించాడు. అయితే, చెస్ నుంచి రిటైర్ కావడంలేదని కార్ల్ సన్ స్పష్టం చేశాడు. 

కార్ల్ సన్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేకపోలేదు. 2013 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు అతడే ప్రపంచ విజేతగా నిలుస్తున్నాడు. 2011 నుంచి చెస్ లో అతడే నెంబర్ వన్. విశ్వనాథన్ ఆనంద్ వంటి దిగ్గజాలు కెరీర్ చరమాంకంలో ఉండగా, కొత్తగా వచ్చేవాళ్లు కార్ల్ సన్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నారు. 

మామూలు టోర్నమెంట్లలో కార్ల్ సన్ కు అడపాదడపా పరాజయాలు ఎదురైనా, వరల్డ్ చాంపియన్ షిప్ కు వచ్చేసరికి అతడి ఆట మరోస్థాయిలో ఉంటుంది. పక్కా ప్లానింగ్ తో ఆడి వరల్డ్ టైటిల్ గెలవడం అలవాటుగా మారింది. చిన్నవయసులోనే రికార్డు స్థాయి విజయాలతో కార్ల్ సన్ మేటి చదరంగ క్రీడాకారుడిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. 

అయితే, భవిష్యత్తులో మళ్లీ వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ లోకి అడుగపెట్టే అవకాశాలను కొట్టిపారేయలేనని కార్ల్ సన్ తెలిపాడు. త్వరలోనే చెన్నై వస్తున్నానని, అక్కడ జరిగే చెస్ ఒలింపియాడ్ లో పాల్గొంటానని వెల్లడించాడు. ఇది ఎంతో ఆసక్తికర టోర్నీ అని పేర్కొన్నాడు.


More Telugu News