రజనీకాంత్ సూచనలు పాటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది: దర్శకుడు కేఎస్ రవికుమార్

  • రజనీకాంత్-కేఎస్ రవికుమార్ కాంబోలో లింగ
  • 2014లో వచ్చిన చిత్రం.. బాక్సాఫీసు వద్ద బోల్తా
  • రషెస్ చూసి రజనీ అసంతృప్తి చెందారన్న రవికుమార్
  • బెలూన్ ఫైట్ ముందు ప్లాన్ చేసుకున్నది కాదని వివరణ
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో ఎంతటి భారీ హిట్లు ఉన్నాయో, అంతటి దారుణమైన ఫ్లాపులు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో లింగ చిత్రం ఒకటి. ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకుడు. రజనీకాంత్-కేఎస్ రవికుమార్ ది 'హిట్ కాంబినేషన్' అని పేరుంది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన ముత్తు, నరసింహ బాటలో లింగ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఆశించారు. కానీ, ఆ సినిమా ఓ డిజాస్టర్ అయింది. ఈ సినిమా వచ్చింది 2014లో. అయితే, ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమా పరాజయంపై దర్శకుడు కేఎస్ రవికుమార్ స్పందించారు. 

రజనీకాంత్ చేసిన సూచనలే సినిమాను దెబ్బతీశాయని వివరించారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతున్న సమయంలో రజనీ రషెస్ చూశారని, అయితే అందులో తాను ఆశించిన అంశాలు లేవని ఆయన అసంతృప్తికి గురయ్యారని రవికుమార్ వెల్లడించారు. దాంతో ఆయన పలు సూచనలు చేశారని చెప్పారు. 

క్లైమాక్స్ లో వచ్చిన బెలూన్ ఫైట్ ను తాము ముందుగా ప్లాన్ చేసుకోలేదని, చివర్లో హడావుడిగా పెట్టాల్సి వచ్చిందని వివరించారు. అంతేకాదు, వేగంగా షూటింగ్ పూర్తిచేసి రజనీకాంత్ పుట్టినరోజు నాడు సినిమా రిలీజ్ చేశామని తెలిపారు. దాంతో అవుట్ పుట్ సరిగా రాక సినిమా బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపరిచిందని కేఎస్ రవికుమార్ వివరించారు.


More Telugu News