ఒకే రోజు.. ఒకే వేదిక‌పై.. 53 ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ!

  • కొత్త‌గా కుదిరిన ఒప్పందాలు 26
  • ఒప్పందాల‌ను పున‌రుద్ధ‌రించుకున్న 27 కంపెనీలు
  • వీటి ద్వారా 1.50 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంద‌న్న ప్ర‌భుత్వం
తెలంగాణ‌కు పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్ట‌డంలో మంత్రి కేటీఆర్ స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని అగ్ర శ్రేణి కంపెనీల‌ను తెలంగాణ‌కు వ‌చ్చేలా చేసిన కేటీఆర్‌.. బుధ‌వారం ఓ అరుదైన ఫీట్‌ను న‌మోదు చేశారు. ఒకే రోజు ఒకే వేదిక మీద తెలంగాణ ప్ర‌భుత్వం ఏకంగా 53 సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంది. వీటిలో 26 ఒప్పందాలు కొత్త‌వి కాగా... 27 ఒప్పందాలు పున‌రుద్ధ‌రించ‌బ‌డిన‌వి. ఆయా కంపెనీలు తెలంగాణ అకాడెమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్‌టీఎస్‌)తో ఒప్పందాలు చేసుకున్నాయి. మంత్రి కేటీఆర్‌, తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌ల స‌మ‌క్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. 

ఇక 26 కొత్త ఒప్పందాలు కుదిరిన ఈ వేదిక మీదే... వీటికి అద‌నంగా 27 కంపెనీలు త‌మ ఒప్పందాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వంతో పున‌రుద్ధ‌రించుకుంటూ సంత‌కాలు చేశాయి. వెర‌సి ఒకే వేదిక మీద 53 ఒప్పందాలు జ‌రిగాయి. బుధ‌వారం కుదిరిన ఈ ఒప్పందాల ద్వారా తెలంగాణ‌కు చెందిన 1.50 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్న‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ వెల్ల‌డించింది.


More Telugu News