పార్ల‌మెంటులో రాహుల్ గాంధీ హాజ‌రు 40 శాతం కంటే త‌క్కువే: స్మృతి ఇరానీ

  • రాహుల్ గాంధీపై విరుచుకుపడిన కేంద్ర మంత్రి స్మృతి 
  • ఇప్ప‌టిదాకా రాహుల్ సింగిల్ ప్ర‌శ్న కూడా వేయ‌లేద‌ని వెల్ల‌డి
  • పార్ల‌మెంటును రాహుల్‌ అగౌర‌వ‌ప‌రుస్తున్నార‌న్న కేంద్ర మంత్రి
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏ చిన్న అవ‌కాశం దొరికినా వ‌దిలిపెట్ట‌డం లేదు. నిత్యావ‌స‌రాల‌పైనా జీఎస్టీ విధించిన కేంద్ర ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ బుధ‌వారం పార్ల‌మెంటులో కాంగ్రెస్ స‌హా మిగిలిన విప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగ‌గా...అందులో రాహుల్ గాంధీ కూడా పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భాన్ని ఆస‌రా చేసుకుని రాహుల్‌పై స్మృతి ఇరానీ ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. పార్ల‌మెంటులో రాహుల్ గాంధీ ప్రొగ్రెస్ కార్డు ఇదేనంటూ ఆమె ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

పార్ల‌మెంటులో రాహుల్ గాంధీ హాజ‌రు 40 శాతం కంటే త‌క్కువేన‌ని స్మృతి ఇరానీ తెలిపారు. ఇప్ప‌టిదాకా రాహుల్ గాంధీ సింగిల్ ప్ర‌శ్న‌ను కూడా సంధించ‌లేద‌ని ఆమె వెల్ల‌డించారు. నిత్యం పార్ల‌మెంట‌రీ కార్య‌క‌లాపాల‌ను అగౌర‌వ‌ప‌రుస్తూనే ఉంటార‌ని కూడా ఆమె ఆరోపించారు. వెర‌సి రాజ‌కీయంగా ఏమాత్రం ఉప‌యోగం లేని నేత‌గా రాహుల్ త‌న‌ను తాను మార్చేసుకున్నార‌ని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి నేత‌లు పార్ల‌మెంటులో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లే జ‌ర‌గ‌కుండా అడ్డుప‌డుతున్నార‌ని ఇరానీ ఆరోపించారు.


More Telugu News