భోజనానంతరం ఇలా చేస్తే.. బ్లడ్ గ్లూకోజ్ దారికొస్తుంది!

  • నడక, ఇంటి పని, చిన్నారులతో ఆడుకోవడం
  • కండరాలకు పనిచెప్పే పని ఏదైనా సరే
  • 10 నిమిషాలు చేసినా నియంత్రణలోకి బ్లడ్ గ్లూకోజ్ 
  • అధ్యయన పూర్వకంగా తెలుసుకున్న పరిశోధకులు
మధుమేహంతో బాధపడుతున్న వారు, రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచే ఆహారానికి దూరంగా ఉండడం మంచి విధానం. కొన్ని పదార్థాలతో బ్లడ్ గ్లూకోజు భారీగా పెరగకపోయినప్పటికీ, అవి కూడా ఎంతో కొంత పెరుగుదలకు పరోక్షంగా కారణమవుతాయి. అందుకని రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తిన్న వెంటనే పెరిగిపోకుండా ఉండేందుకు కొంత సమయం పాటు శరీరాన్ని శ్రమ పెట్టడం మంచి విధానంగా నిపుణులు సూచిస్తున్నారు.

సమతుల్యమైన ఆహారాన్ని తీసుకున్నా లేదంటే, తమకు నచ్చిన పదార్థాన్ని తీసుకున్నా.. రక్తంలో షుగర్ స్థాయి పెరగకుండా ఉండడానికి 10 నిమిషాల పాటు కండరాలకు పని చెప్పాలి. ఇందుకోసం తిన్న వెంటనే నడవడాన్ని ఓ అలవాటుగా మార్చుకోవడం ఒక విధానం. లేదంటే ఇంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఫలితాన్నిస్తుంది. చిన్నారులతో 10 నిమిషాల పాటు ఆడుకోవడం కూడా మంచిదే. తేలికపాటి వ్యాయామాలు, నచ్చిన పాటకు నృత్యం చేయడం ఇవన్నీ కూడా ఆహారం రూపంలో రక్తంలోకి చేరిన చక్కెరలను తగ్గించేందుకు సాయపడతాయి.

పరిశోధకులు అధ్యయనం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారు. కొంత మందిని తీసుకుని వారిని రెండు బృందాలుగా చేశారు. తిన్న తర్వాత పెద్దగా కదలకుండా ఉండే పనిని ఒక బృందం వారికి అప్పగించారు. అంటే టీవీ చూడడం వంటి పనులు చేయమని చెప్పారు. మరో బృందం వారికి చురుగ్గా కదిలేలా పనులు అప్పగించారు. 

దీంతో తిన్న అర గంటలోపు శరీరాన్ని శ్రమ పెట్టిన రెండో బృందం లోని వారిలో బ్లడ్ గ్లూకోజు నియంత్రణలో ఉన్నట్టు గుర్తించారు. తక్కువ శ్రమతో కూడిన పనులను 10 నిమిషాల పాటు చేసినా మంచి ఫలితాలు కనిపించాయి. ‘‘మీ కండరాలు కదిలిన ప్రతీసారీ వాటికి శక్తి అవసరం. కండరాలు వాటికి కావాల్సిన శక్తి కోసం రక్తంలోకి చేరిన గ్లూకోజును తీసుకుంటాయి’’ అని పరిశోధకులు తెలిపారు.


More Telugu News