కరోనా టీకాలు సమకూర్చిన వారిని అభినందిస్తూ ప్రధాని లేఖ

  • మీ సహకారం వల్లే భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందన్న ప్రధాని
  • కరోనా మహమ్మారిపై అసాధారణ విజయంగా అభివర్ణన
  • హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు అభినందనలు
భారత్ 200 కోట్ల డోసుల కరోనా టీకాల మైలురాయిని అధిగమించడంతో ప్రధాని నరేంద్ర మోదీ టీకాలు సమకూర్చిన వారికి (వ్యాక్సినేటర్లు) స్వయంగా లేఖ రాశారు. వారిని అభినందిస్తూ, వారి మద్దతుతో భారత్ ఈ మైలురాయిని చేరుకోగలిగినట్టు పేర్కొన్నారు. 

మీరు చురుగ్గా పాల్గొనడం వల్లే భారత్ మరోసారి చరిత్రను సృష్టించింది. కరోనా టీకాల కార్యక్రమం 2021 జనవరి 16న మొదలైంది. 2022 జులై 17 నాటికి పెద్ద మైలురాయికి చేరుకున్నాం. 200 కోట్ల డోసులు ఇవ్వడంతో దేశానికి గుర్తుండిపోయే రోజు ఇది. కరోనా మహమ్మారిపై మన అసాధారణ విజయం ఇది. 

వందేళ్లకు ఓసారి వచ్చే ప్రపంచ మహమ్మారి సమయంలో ప్రాణాలను కాపాడడం ఎంతో కీలకం. వ్యాక్సినేటర్లు, హెల్త్ కేర్ సిబ్బంది, సహాయక సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు భారతీయులను కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. అవసరమైన సమయంలో సేవలు అందించడంలో ఈ అంకిత భావం నిజంగా అభినందించ తగినది. 

ఈ చారిత్రాత్మక సందర్భంలో భారత కరోనా టీకాల కార్యక్రమానికి మీరు అందించిన సేవలకు నా అభినందనలు’’ అంటూ ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. 98 శాతం వయోజనులు కనీసం ఒక డోస్ కోవిడ్ టీకా తీసుకున్నారు. 90 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. 



More Telugu News