జీఎస్టీ రేట్ల పెంపుపై పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

  • ప్లకార్డులు పట్టుకొని విపక్షాలతో కలిసి నిరసన తెలుపుతున్న ఎంపీలు
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
  • జిల్లాల్లో నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల పెంపుపై పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు నేతృత్వంలో విపక్ష పార్టీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర బీజేపీ ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పాలు, పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీఎస్టీ పన్ను విధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  మంగళవారం ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ.. అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆందోళన కార్యక్రమాల్లో రైతులను ముఖ్యంగా పాడి రైతులను భాగస్వాములుగా చేయాలని కేటీఆర్  కోరారు.


More Telugu News