యూరప్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఆరువారాల్లో మూడింతలు పెరిగిన కేసులు

  • ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కొత్త వేవ్‌కు కారణమవుతున్నాయన్న డబ్ల్యూహెచ్ఓ
  • ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగం యూరప్‌లోనే..
  • వారానికి మూడువేల మంది మృతి
  • ఐదేళ్లు, ఆపై వయసున్న చిన్నారులకు బూస్టర్ డోసు ఇవ్వాలని సూచన
కరోనా వైరస్ యూరప్‌లో మళ్లీ పడగవిప్పుతోంది. ఆరు వారాల్లోనే అక్కడ కేసులు రెట్టింపు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా రెండింతలు పెరిగింది. కరోనాను ప్రజలు తక్కువగా అంచనా వేయొద్దని, ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు కొత్త వేవ్‌కు కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఐరోపా డైరెక్టర్ డాక్టర్ హన్స్ క్లూగే తెలిపారు. మళ్లీ మళ్లీ వచ్చే ఇన్ఫెక్షన్లు దీర్ఘకాల కొవిడ్‌కు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. 

ఇక యూరప్‌లోని 53 దేశాల్లో గత వారం ఏకంగా 30 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. వారానికి మూడువేలమంది ఈ మహమ్మారి కారణంగా మరణిస్తున్నారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు సగం ఇక్కడే నమోదవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. శీతాకాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని డాక్టర్ క్లూగే పేర్కొన్నారు.

తాజా హెచ్చరికల నేపథ్యంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే ఐదేళ్లు, ఆపై వయసున్న చిన్నారులకు బూస్టర్ డోసు వేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ప్రజలు ఎక్కడున్నా మాస్కు ధరించడం మర్చిపోవద్దని పేర్కొంది. అలాగే, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో మెరుగైన వెంటిలేషన్ వచ్చేలా చూసుకోవాలని డాక్టర్ క్లూగే తెలిపారు.


More Telugu News