నడిచైనా వెళతానేమో కానీ జన్మలో ఇండిగో విమానం మాత్రం ఎక్కను.... శపథం చేసిన కేరళ రాజకీయనేత

  • సీఎం విజయన్ తో ఒకే విమానంలో ప్రయాణించిన జయరాజన్
  • సీఎంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు
  • విమానంలో కాంగ్రెస్ కార్యకర్తలను నెట్టివేసిన జయరాజన్
  • జయరాజన్ పై ఇండిగో 3 వారాల నిషేధం
కేరళ రాజకీయనేత, అధికార పక్షం ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ తీవ్ర శపథం చేశారు. ఈ జన్మలో ఇండిగో విమానం ఎక్కనంటూ ప్రతినబూనారు. తానే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా ఇండిగో విమానాల్లో ప్రయాణించరని అన్నారు. నడిచి ఎంతదూరమైనా వెళతాను కానీ ఇండిగో విమానం మాత్రం ఎక్కబోనని స్పష్టం చేశారు. జయరాజన్ ఆగ్రహానికి బలమైన కారణం ఉంది. 

ఇటీవల జయరాజన్ విమానంలో తోటి ప్రయాణికులపై దౌర్జన్యం చేశారంటూ ఇండిగో సంస్థ ఆయనపై 3 వారాల నిషేధం విధించింది. గత నెల 13న కేరళ సీఎం పినరయి విజయన్ తో కలిసి ఆయన కున్నూర్ నుంచి తిరువనంతపురం వరకు విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు గోల్డ్ స్కాంకు సంబంధించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలిద్దరినీ జయరాజన్ దురుసుగా నెట్టివేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 

జయరాజన్ చర్యను ఇండిగో ఆక్షేపించింది. విమానంలో నినాదాలు చేసిన ఆ ఇద్దరు కార్యకర్తలపైనా ఇండిగో 2 వారాలు నిషేధం విధించింది. అటు, ఆ ఇద్దరు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


More Telugu News