అబార్షన్ కు హైకోర్టు అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన అవివాహిత యువతి

  • ప్రియుడి ద్వారా గర్భం దాల్చిన యువతి
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడు
  • అబార్షన్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
  • 20 వారాల గర్భానికే అబార్షన్ కు అనుమతివ్వగలమన్న కోర్టు
  • ఇప్పుడామెకు 23 వారాల గర్భం అని వెల్లడి
ఇటీవల ఓ అవివాహత అబార్షన్ కు అనుమతించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆమెకు నిరాశ ఎదురైంది. 20 వారాల గర్భం వరకే చట్టప్రకారం అబార్షన్ కు అనుమతి ఉంటుందని, 23 వారాల గర్భంతో ఉన్న ఆమెకు ఆమెకు అనుమతి ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. దాంతో, ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ 25 ఏళ్ల యువతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందుకొచ్చింది. 

ఆ యువతి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, తన క్లయింటు ప్రతిరోజు మానసిక క్షోభ అనుభవిస్తోందని, అబార్షన్ కు అనుమతించకపోవడం ఆమె పట్ల క్రూరత్వం ప్రదర్శించడమేనని అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యత క్రమంలో ఆమె కేసును త్వరితగతిన విచారించాలని విన్నవించారు. దీనిపై సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ, పిటిషన్ ను పూర్తిగా పరిశీలించిన మీదట విచారణకు స్వీకరిస్తామని తెలిపారు. 

కాగా, ప్రియుడి కారణంగా తాను గర్భం దాల్చానని, పెళ్లి చేసుకుంటానని అతడు మోసం చేశాడని ఆ యువతి కోర్టుకు తెలిపింది. సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తల్లి అయ్యేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని వెల్లడించింది.


More Telugu News