బీజేపీది బురద రాజకీయం.. వారు గెలిస్తే కేసీఆర్ పథకాలను ఆపేస్తారు: హరీశ్ రావు

  • రెండు నెలల్లో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్న మంత్రి 
  • స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడి 
  • పేదలకు పథకాలు అమలు చేస్తామంటే కేంద్రం వద్దంటోందని ఆరోపణ
గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత వరద వచ్చిందని.. అయినా ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అయినా బీజేపీ నేతలు బురద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో వచ్చే రెండు నెలల్లో కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులను మంజూరు చేస్తామని.. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని.. త్వరలో 57 ఏళ్లు నిండిన వారికి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు.

పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతున్నారు
తెలంగాణలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తారని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న అద్భుత పథకాలు ఎక్కడైనా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 

‘‘బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన గజ దొంగలకు వేల కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. పేదల కోసం పథకాలు అమలు చేస్తామంటే ఉచితాలు వద్దు అంటోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నంత అభివృద్ధి ఉందా? రాష్ట్ర ప్రభుత్వం సంపద పెంచి పేదలకు పంచుతుంటే.. కేంద్ర  ప్రభుత్వం మాత్రం పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతోంది..” అని హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.



More Telugu News