18 ఏళ్ల కిందట వైఎస్సార్ కట్టిన దేవాదుల చెక్కుచెదరలేదు... లక్షల కోట్లతో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అప్పుడే మునిగిపోయింది: షర్మిల

  • ఇటీవల గోదావరికి భారీ వరదలు
  • కాళేశ్వరం పంప్ హౌస్ లు మునక
  • భారీ వరదల వల్లే మునిగిపోయాయన్న ప్రభుత్వం!
  • విమర్శనాత్మకంగా స్పందించిన షర్మిల
ఇటీవల గోదావరి వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు పంప్ హౌస్ లు మునిగిపోవడం తెలిసిందే. గత రెండు వందల ఏళ్లలో గోదావరికి ఎన్నడూ రానంత భారీ వరదలు వచ్చినందునే కాళేశ్వరం మునిగిపోయిందని రాష్ట్రప్రభుత్వం, నీటిపారుదల ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే, భారీ వరదల వల్లే కాళేశ్వరం మునిగితే దేవాదుల ఎందుకు మునగలేదు? అంటూ ఓ పత్రికలో కథనం వచ్చింది. 

దీనిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 18 ఏళ్ల కిందట వైఎస్సార్ హయాంలో నిర్మాణం జరుపుకున్న దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ చెక్కుచెదరకుండా పనిచేస్తోందని తెలిపారు. కానీ, లక్షల కోట్లు అప్పు తెచ్చి మరీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్ లు పట్టుమని రెండేళ్లు కాకుండానే మునిగిపోయాయని విమర్శించారు. 

13 లక్షల క్యూసెక్కుల వరదకు అన్నారం పంపుహౌస్ మునిగితే, 28 లక్షల క్యూసెక్కుల వరదకు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిందని వివరించారు. కానీ, 29.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దేవాదుల పంప్ హౌస్ చెక్కుచెదరలేని, రికార్డు స్థాయిలో వచ్చిన వరదను సైతం తట్టుకుని దేవాదుల నిలబడిందని షర్మిల పేర్కొన్నారు.

సమర్థత ఉన్న నాయకుడి పనితీరుకు నిదర్శనం వైఎస్సార్ దేవాదుల అయితే... అవినీతికి, అనవసరపు ఖర్చుకు నిదర్శనం కేసీఆర్ కాళేశ్వరం అని విమర్శించారు.


More Telugu News