పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన
- పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా నిరసన
- మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- లోక్ సభ, రాజ్యసభలలో విపక్షాల ఆందోళనలు
టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం అంశాలపై లోక్ సభలో ఈరోజు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబట్టి, స్పీకర్ ఛైర్ ను చుట్టుముట్టారు. దీంతో విపక్ష సభ్యుల వైఖరి పట్ల స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభలోకి ప్లకార్డులకు అనుమతి లేదని చెప్పారు. రాజ్యసభలో సైతం ఇదే తరహా గందరగోళం నెలకొంది. ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపు, ధరల పెరుగుదలను నిరసిస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి.