‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో బ్యాలెట్ బాక్సుల కోసం ప్రత్యేకంగా విమాన టికెట్లు బుక్ చేసిన ఈసీ!

  • రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులు రాజధానికి తరలింపు
  • వాటి కోసం ప్రత్యేకంగా ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో ‘టూవే’ టికెట్లు
  • వైరల్ అవుతున్న ఫొటోలు
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిన్న ముగియడంతో ఆయా రాష్ట్రాల రాజధానుల నుంచి బ్యాలెట్ బాక్సులను దేశ రాజధానికి తరలించేందుకు అధికారులు ప్రత్యేకంగా విమాన టికెట్లు బుక్ చేయడం చర్చనీయాంశమైంది. ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో అవన్నీ విమానమెక్కాయి. విమానం సీట్లో బ్యాలెట్ బాక్సులతో ప్రయాణిస్తున్న అధికారుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్నికల సంఘం (ECI) 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులను పంపింది. ఇందుకోసం 'మిస్టర్ బ్యాలెట్ బాక్స్' పేరుతో ప్రత్యేకంగా 'టూ వే' విమాన టిక్కెట్లను బుక్ చేసింది. గతంలో బ్యాలెట్ బాక్సులను పర్యవేక్షిస్తున్న అధికారుల హ్యాండ్ బ్యాగేజీగా వీటిని పంపేవారు. ఈసారి మాత్రం వాటి కోసం ప్రత్యేకంగా టికెట్లు బుక్ చేయడం గమనార్హం.

బ్యాలెట్ బాక్సులను తమ పక్కసీట్లో పెట్టుకుని అధికారులు ఢిల్లీకి బయలుదేరారు. బ్యాలెట్ బాక్సులను విమానంలో ప్రత్యేకంగా రవాణా చేయనున్నట్టు ఈసీ ఇది వరకే తెలిపింది. ఇందుకోసం ‘మిస్టర్ బ్యాలెట్ బాక్స్’ పేరుతో విమాన టికెట్లను బుక్ చేసినట్టు కూడా పేర్కొంది. కాగా, రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపును ఎల్లుండి నిర్వహిస్తారు.


More Telugu News