క్లౌడ్ బరస్ట్ ఏంటో, క్లౌడ్ సీడింగ్ ఏమిటో తెలుసా?.. కేసీఆర్ తెలుసుకుని మాట్లాడాలి..: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • ఏ దేశం వాళ్లు కుట్ర చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్
  • జీహెచ్ ఎంసీ వరద బాధితులకు హామీ ఇచ్చి కూడా పరిహారం ఇవ్వలేదని మండిపాటు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన
అసలు క్లౌడ్ బరస్ట్, క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటో సీఎం కేసీఆర్ కు తెలుసా? అని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఏదైనా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. క్లౌడ్ బరస్ట్ కు విదేశాల కుట్ర ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో.. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. క్లౌడ్ బరస్ట్, క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటో, ఆ విధానాలు ఏమిటో వివరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాటలను తప్పుపట్టారు.

కేసీఆర్ స్పష్టత ఇవ్వాలి..
ఇంతకీ ఈ క్లౌడ్‌ బరస్ట్‌ ఎలా జరిగిందని.. అందులో విదేశీ కుట్ర ఉందని సీఎం కేసీఆర్ అంటున్నారని.. ఏ దేశం వాళ్లు కుట్ర చేశారో, ఆయనకు ఉన్న సమాచారం ఏమిటో స్పష్టంగా వెల్లడించాలి అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. క్లౌడ్ బరస్ట్‌ వల్ల కేవలం కొన్ని గంటల పాటు, అదీ కొంత ప్రాంతంలో మాత్రమే భారీ వర్షం కురుస్తుందని స్పష్టం చేశారు. రోజంతా వర్షం పడేది ఇతర కారణాల వల్ల అని స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్‌, క్లౌడ్‌ సీడింగ్ అంటే ఏమిటో అర్థం చేసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. వరద నష్టం, ముంపు బాధితుల విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ వరద బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయ లేదని ఆరోపించారు.



More Telugu News