సీఎం కేసీఆర్ తో సీతక్క!... ఏటూరు నాగారంలో ఆసక్తికర దృశ్యం!
- వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేసీఆర్
- ఏటూరునాగారంలో కేసీఆర్‌తో కలిసిన సీతక్క
- కేసీఆర్ అధికారుల సమీక్షకూ హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతాల పరిశీలనకు ఆదివారం బయలుదేరిన సీఎం కేసీఆర్... భద్రాచలం, ములుగు, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీఎం కేసీఆర్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సీఎం కేసీఆర్‌తో ఏటూరు నాగారంలో వరద ప్రాంతాలను పరిశీలించిన సీతక్క.. వరద నష్టంపై కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ పాలుపంచుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయిలో జరుగుతోంది. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు మారిపోయాయి. అధికార టీఆర్ఎస్ పాలనపై రేవంత్ తో పాటు సీతక్క కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తన నియోజకవర్గ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన కేసీఆర్‌తో కలిసి సీతక్క ఆయా ప్రాంతాల్లో పర్యటించడం గమనార్హం.