హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఇలా మార్చుకోవచ్చు..!

  • సేవలు నచ్చకపోయినా, క్లెయిమ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నా మారచ్చు 
  • రెన్యువల్ కు 45 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి 
  • పాత సంస్థలో అందుకున్న ప్రయోజనాలు సైతం బదిలీ
మొబైల్ నంబర్ ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకోవడం తెలుసు కదా. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకోవచ్చు. ఈ సదుపాయం వచ్చి ఎన్నో ఏళ్లు అయినా ఇప్పటికీ చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. 

మొబైల్ ఆపరేటర్ సేవలు నచ్చకపోతే, అదే సంస్థతో కొనసాగాల్సిన గత్యంతరం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టింగ్ సదుపాయంతో చక్కగా సేవలు బాగున్న కంపెనీకి మారిపోవచ్చు. మరి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న తర్వాత, కంపెనీ సేవలు నచ్చకపోయినా, క్లెయిమ్ సేవల పట్ల అసంతృప్తితో ఉన్నా అలాగే కొనసాగక్కర్లేదు. అదే ప్లాన్ పై వేరే కంపెనీకి మారిపోవచ్చు. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికే తీసుకున్న ప్లాన్ లో కొన్ని రకాల కవరేజీలకు వెయిటింగ్ పీరియడ్ పూర్తయిందనుకోండి.. పోర్టింగ్ తో ఈ సదుపాయాలను కూడా కొత్త సంస్థకు బదలాయించుకోవచ్చు. ఒకవేళ పాత సంస్థను వదిలిపెట్టి, వేరే సంస్థలో కొత్త ప్లాన్ తీసుకుంటే అప్పుడు ఈ ప్రయోజనాలు రావు, పైగా ప్రీమియం కూడా వయసు పెరగడం వల్ల అధికం కావచ్చు.

పోర్టింగ్
హెల్త్ ప్లాన్ తో పాటు, నో క్లెయిమ్ బోనస్ లను కూడా కొత్త కంపెనీకి మార్చుకోవచ్చు. పాత సంస్థలో పాలసీదారు నిర్ణీత కాలం పాటు వేచి ఉండడం వల్ల ముందు నుంచి ఉన్న వ్యాధులకు వచ్చిన కవరేజీ ప్రయోజనాలను కొత్త సంస్థ కొనసాగించాల్సి ఉంటుంది. అయితే, ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా, రెన్యువల్ సమయంలోనే పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు పాలసీదారుకు లభించిన బీమా రక్షణ కవరేజీకి తగ్గకుండా కొత్త సంస్థ కవరేజీని ఆఫర్ చేయాల్సి ఉంటుంది.

ప్రక్రియ
పాలసీ ఏటా రెన్యువల్ చేసుకోవాలని తెలుసు కదా. రెన్యువల్ గడువుకు 45 రోజుల ముందు తన పాలసీని ఫలానా బీమా సంస్థకు పోర్ట్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలి. రెన్యువల్ కు ఇంకా 45 - 60 రోజులు ఉందనగానే దీన్ని పూర్తి చేసుకోవాలి. ప్రస్తుత పాలసీ వివరాలు, కొత్త సంస్థ వివరాలు ఇవ్వాలి. అలాగే, ఇన్సూరెన్స్ పోర్టబులిటీ దరఖాస్తు, ప్రపోజల్ ఫామ్, మెడికల్ రిపోర్ట్ లను కొత్త సంస్థకు ఇవ్వాలి. ఈ ప్రపోజల్ ను నూతన బీమా సంస్థ 15 రోజుల్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ప్రపోజల్ ను కొత్త సంస్థ అమోదిస్తే, అప్పుడు ప్రీమియంను కొత్త సంస్థకు చెల్లించాలి. ఐఆర్డీఏఐ నిర్ధేశించిన కాల పరిమితిలోపు బీమా సంస్థలు పోర్టింగ్ ను ముగించాల్సి ఉంటుంది.


More Telugu News