ప్రభుత్వ వైఫల్యాన్ని విదేశీ కుట్రగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు: కేసీఆర్ పై కోదండరామ్ ఫైర్

  • తెలంగాణలో భారీ వర్షాలకు విదేశాల క్లౌడ్ సీడింగ్ కారణమన్న కేసీఆర్
  • క్లౌడ్ సీడింగ్ కు శాస్త్రీయత లేదన్న కోదండరామ్
  • విదేశీ కుట్ర ఉందనడం కేసీఆర్ అవివేకమని విమర్శ
తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. భారత్ అంటే గిట్టని దేశాలు క్లౌడ్ సీడింగ్ విధానం ద్వారా కావాలని భారీ వర్షాలను కురిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. మన దేశంలో అక్కడక్కడ ఇలాంటి విధానం ద్వారా వరదలు ముంచెత్తేలా చేశారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీల నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  

కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరామ్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని అనడం కేసీఆర్ అవివేకమని చెప్పారు. క్లౌడ్ సీడింగ్ కు ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయత లేదని అన్నారు. 

ముందు చూపుతో వ్యవహరించి నదీ నీటి నిర్వహణను ప్లాన్ చేసి ఉంటే ఇంతటి భారీ వరద ముప్పును ఎదుర్కోవాల్సి వచ్చి ఉండేది కాదని కోదండరామ్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంపింగ్ హౌస్ మోటార్లు మునిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. సరైన ప్లానింగ్ లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కూడా తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరిగా లేదని అన్నారు. పోలవరం పూర్తయితే మరిన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ ఎన్నో గ్రామాలను ముంచేస్తుందని తెలిపారు.


More Telugu News