పంత్ వీరోచిత సెంచరీ... చివరి వన్డేలో గెలుపుతో సిరీస్ టీమిండియా కైవసం

  • మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్లతో విజయం
  • సొంతగడ్డపై ఇంగ్లండ్ కు భంగపాటు
  • వన్డే సిరీస్ 2-1తో టీమిండియా వశం
  • 113 బంతుల్లో 125 పరుగులు చేసిన పంత్
  • విల్లీ బౌలింగ్ లో వరుసగా 5 ఫోర్లు కొట్టిన వైనం
ఇంగ్లండ్ తో చివరి వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించింది. పంత్ సూపర్ సెంచరీతో చెలరేగిపోగా, టీమిండియా మరో 47 బంతులు మిగిలుండగానే జయభేరి మోగించింది. పంత్ కు వన్డేల్లో ఇదే తొలి సెంచరీ. పంత్ 113 బంతుల్లో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 16 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. పంత్ సెంచరీ సాయంతో టీమిండియా 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి మ్యాచ్ లో విజయాన్ని, తద్వారా 2-1తో వన్డే సిరీస్ ను చేజిక్కించుకుంది. 

260 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసినా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు. చివర్లో డేవిడ్ విల్లీ విసిరిన ఓవర్లో పంత్ వరుసగా 5 ఫోర్లు కొట్టడం హైలైట్ గా నిలిచింది. 

పాండ్యా 55 బంతుల్లో 10 ఫోర్లతో 71 పరుగులు చేశాడు. పాండ్యా అవుటైన తర్వాత రవీంద్ర జడేజా బరిలో దిగాడు. అతడు కూడా పరిస్థితికి తగ్గట్టుగా ఆడగా, మరో ఎండ్ లో పంత్ విజృంభించాడు. దాంతో టీమిండియా సునాయాసంగా గెలుపు తీరాలకు చేరింది.


More Telugu News