పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన రఘురామకృష్ణరాజు

  • భీమవరంలో పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్
  • రఘురామకు మద్దతుగా వ్యాఖ్యలు
  • ఎంపీ అని కూడా చూడకుండా కొట్టించారని వెల్లడి
  • స్పందించిన రఘురామ
భీమవరంలో ఇవాళ జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ రెబెల్ ఎంపీని గతంలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. సొంత పార్టీలో సమస్యలను ప్రస్తావించినందుకు ఎంపీ అని కూడా చూడకుండా పోలీసులతో లాక్కొచ్చి చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. 

అరికాళ్లపై కొట్టించి, నడవలేకుండా చేశారని వివరించారు. మొన్నటికిమొన్న ఆయన తన సొంత నియోజకవర్గంలోకి రాలేని పరిస్థితులు తీసుకువచ్చారని వెల్లడించారు. ఇది రఘురామకృష్ణరాజు మీద చేసిన దాడిలా చూడడంలేదని, క్షత్రియులందరిపై వైసీపీ చేసిన దాడిగా చూస్తున్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

"అదే మీ పులివెందులలో ఈ విధంగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనం కులాలుగా విడిపోయాం. రఘురామకృష్ణరాజు నా కులం కాదు. కానీ, నా సాటి మనిషి. ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి ఆయన. ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడితే అందుకు బదులివ్వడం అనేది ఉంటుంది. కానీ అందుకు ఓ పరిమితి ఉంటుంది" అంటూ వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు వెంటనే స్పందించారు. పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఐడీ పోలీసులు నాపై చేసిన క్రూరమైన దాడిని మీరు ఖండించినందుకు ధన్యవాదాలు అంటూ పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. పవన్ వ్యాఖ్యల వీడియోను కూడా పంచుకున్నారు.


More Telugu News