గాల్లో ఉన్న ఎయిరిండియా విమానంలో పిచ్చుక కలకలం

  • బహ్రెయిన్ నుంచి కొచ్చి వస్తున్న విమానం
  • మార్గమధ్యంలో కాక్ పిట్ లో దర్శనమిచ్చిన పక్షి
  • కొచ్చిలో ల్యాండైన విమానం
  • పక్షికి విముక్తి
బహ్రెయిన్ నుంచి కొచ్చి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ పిచ్చుక కలకలం రేపింది. జులై 15న ఈ విమానం గాల్లో ప్రయాణిస్తుండగా, కాక్ పిట్ లో చిన్న పక్షిని గుర్తించారు. ఆ సమయంలో విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది.

బహ్రెయిన్ ఎయిర్ పోర్టులోనే ఫ్లయిట్ ఇంజినీర్ దాన్ని గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేయగా, ఆ పక్షి తుర్రుమంటూ ఎగిరి ఫ్లయిట్ డెక్ లోకి ప్రవేశించింది. విమానం సగం దూరం ప్రయాణించిన తర్వాత అది కాక్ పిట్ లోకి వచ్చింది. ఈ బోయింగ్ 737 విమానం కొచ్చిలో ల్యాండయిన తర్వాత ఆ పక్షిని పట్టుకున్నారు. దాన్ని వెలుపలికి తీసుకువచ్చి వదిలేశారు. 

అయితే, ఇది విమాన భద్రతకు సంబంధించిన అంశం కావడంతో డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. విమానంలో పక్షి దూరడంపై విచారణకు ఉపక్రమించింది.


More Telugu News