భారీ వర్షాల వెనుక విదేశీ హస్తం ఉందనడం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్

  • తెలంగాణలో విపరీతంగా వర్షాలు
  • కుట్రకోణం ఉండొచ్చన్న కేసీఆర్
  • క్లౌడ్ బరస్ట్ కు పాల్పడి ఉంటారని వ్యాఖ్యలు
  • కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్న బండి సంజయ్
ఇటీవల భారీ వర్షాలు కురిసి, గోదావరికి వరద పోటెత్తడం వెనుక కుట్రకోణం ఉండొచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ (అనూహ్య రీతిలో భారీ వర్షపాతం) సంభవిస్తోందని, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోనూ ఇలాగే క్లౌడ్ బరస్ట్ కు పాల్పడి ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. గతంలో కశ్మీర్, లేహ్ ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్ కు విదేశాల నుంచి కుట్ర జరిగిందన్న ప్రచారం ఉందని వివరించారు. 

దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని అభివర్ణించారు. సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఆయనకు మతిభ్రమించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణమే సీఎం కేసీఆర్ ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చి, మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తప్పిదాలతోనే కాళేశ్వరం మునిగిపోయిందని విమర్శించారు. 10 వేల ఇళ్లతో కాలనీ, కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ వంచించే హామీలు ఇస్తున్నారని అన్నారు.


More Telugu News