చివరి వన్డేలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ... విజయంపై కన్నేసిన టీమిండియా

  • మాంచెస్టర్ లో మ్యాచ్
  • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • సిరీస్ లో చెరో మ్యాచ్ నెగ్గిన టీమిండియా, ఇంగ్లండ్
  • సిరీస్ విజేతను తేల్చనున్న నేటి మ్యాచ్
ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా నేడు చివరి వన్డే ఆడుతోంది. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఇరుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమవుజ్జీలుగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా కృతనిశ్చయంతో ఉంది. 

ఇంగ్లండ్ పర్యటనలో రీషెడ్యూల్డ్ టెస్టు ఓడిపోయిన టీమిండియా, ఆ తర్వాత టీ20 సిరీస్ ను చేజిక్కించుకుని సత్తా చాటింది. ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా దక్కించుకుని సగర్వంగా పర్యటన ముగించాలని భావిస్తోంది. అయితే, భారత విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న పేసర్ జస్ప్రీత్ బుమ్రా వీపు నొప్పితో ఈ మ్యాచ్ కు దూరం కావడం ప్రతికూలాంశం. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. 

అటు, ఇంగ్లండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రెండో వన్డే నెగ్గిన జట్టునే బరిలో దింపుతున్నట్టు కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు.


More Telugu News