నేడు ఇంగ్లండ్​ తో భారత్​ మూడో వన్డే.. సిరీస్​ గెలవాలంటే ఇలా చేయాల్సిందే!

  • గత రెండు మ్యాచ్ ల్లో  రాణించిన బౌలర్లు
  • బ్యాటర్లు కూడా పుంజుకుంటేనే విజయం దక్కే అవకాశం
  • అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే
ఇంగ్లండ్‌ పర్యటనలో భారత క్రికెట్ జట్టు ఆఖరాటకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగే చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ తో పోటీ పడనుంది. ఇరు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చనుంది. దాంతో, ఈ మ్యాచ్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. టీ20 సిరీస్‌ గెలిచి వచ్చిన ఉత్సాహంలో తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన రోహిత్ సేనకు  రెండో పోరులో ఆతిథ్య జట్టు  దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏకంగా వంద పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది. తొలి రెండు మ్యాచుల్లో బౌలర్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ బ్యాటర్ల జట్టు వైఫల్యమే జట్టును దెబ్బ కొట్టింది. 

అయినప్పటికీ ఇంగ్లండ్‌ గడ్డపై వరుసగా రెండు సిరీస్‌లు గెలిచే అవకాశం  జట్టును ఊరిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాటర్లు పుంజుకుంటేనే జట్టు మూడో మ్యాచ్ తో పాటు సిరీస్ గెలవగలదు. టీ20 సిరీస్ లో భారత జట్టు బ్యాటర్లంతా దూకుడుగా ఆడి విజయం సాధించారు. కానీ, వన్డే సిరీస్ కు వచ్చే సరికి రక్షణాత్మకంగా ఆడి దెబ్బతిన్నారు. ఈ నేపథ్యంలో టీ20ల మాదిరిగా యాభై ఓవర్ల ఆటలోనూ దూకుడు చూపెట్టాలని భారత్ ఆశిస్తోంది. రెండో వన్డేలో అతి జాగ్రత్తకు పోయి నిరాశ పరిచిన ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ శుభారంభం ఇవ్వాల్సి ఉంటుంది. 

ఇక, ఈ మ్యాచ్‌లోనూ అందరి ఫోకస్‌ కోహ్లీపైనే ఉండనుంది. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉంటున్న కోహ్లీ ఫామ్ అందుకునేందుకు ఇదే చివరి చాన్స్‌గా కనిపిస్తోంది. కోహ్లీ ఏ ఫార్మాట్‌లోనూ శతకం చేయక వెయ్యి రోజులు సమీపిస్తున్నాయి.  మ్యాచ్లో అయినా అతను సత్తా చాటితే అభిమానులు ఆనందిస్తారు. మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బాగా ఆడుతున్నారు. గత మ్యాచ్ లో డకౌటైన రిషబ్ పంత్ పుంజుకుంటే జట్టుకు లాభం చేకూరుతుంది. బౌలర్లు అదే జోరు కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు.


More Telugu News