భీమ‌వ‌రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌... జ‌న‌వాణిలో ప్ర‌జా ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌

  • ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం జ‌న‌సేన జ‌న‌వాణి
  • మూడో విడ‌త జ‌న‌వాణిని భీమ‌వ‌రంలో ప్రారంభించిన ప‌వ‌న్‌
  • డంపింగ్ యార్డ్ స‌మ‌స్య అలాగే ఉంద‌ని తెలిసింద‌న్న జ‌న‌సేనాని
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ ఆదివారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం చేరుకున్నారు. జ‌న‌సేన చేప‌ట్టిన జ‌న‌వాణి కార్య‌క్ర‌మంలో భాగంగా గ‌డ‌చిన రెండు వారాలుగా విజ‌య‌వాడ‌లో ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌వ‌న్‌... ఈ ఆదివారం భీమ‌వ‌రంలో జ‌న‌వాణిని నిర్వ‌హిస్తున్నారు. ఆదివారం ఉద‌యం విజ‌య‌వాడ నుంచి భీమ‌వ‌రం చేరిన ప‌వ‌న్‌... జ‌న‌వాణిలో భాగంగా ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రిస్తున్నారు.

జ‌న‌సేన జ‌న‌వాణికి ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌వుతున్నార‌న్న స‌మాచారంతో భీమ‌వరానికి చెందిన ప్ర‌జ‌లు పెద్ద సంఖ్యలో విన‌తి ప‌త్రాల‌తో జ‌న‌వాణికి హాజ‌ర‌య్యారు. జన‌వాణిని మొద‌లుపెట్టిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భీమవరంలో ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్న ఆయ‌న‌.. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఎన్నో సమస్యలు త‌మ‌ దృష్టికి వచ్చాయని తెలిపారు. భీమవరం రాగానే డంపింగ్ యార్డ్ సమస్య ఏమైందని అడిగితే ఇప్పటికి అలానే ఉందని తెలిసింద‌ని ఆయ‌న తెలిపారు. ఎన్నికల్లో త‌న‌ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు పెట్టిన నేత‌లు... సమస్యల పరిష్కారానికి ఎందుకు పనిచేయడం లేదని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.


More Telugu News