చత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లోనూ విభేదాలు.. సీఎం తీరును నిరసిస్తూ మంత్రి రాజీనామా

  • సీఎం బఘేల్.. మంత్రి సింగ్‌దేవ్ మధ్య మరింత ముదిరిన విభేదాలు
  • రెండో సగంలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న సింగ్‌దేవ్
  • అధిష్ఠానం రాజీ కుదర్చినా ఫలితం శూన్యం
గోవా కాంగ్రెస్‌లో కలకలం సద్దుమణగక ముందే చత్తీస్‌‌గఢ్‌లోనూ అధికార కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి  భూపేశ్ బఘేల్.. మంత్రి టీఎస్ సింగ్‌దేవ్‌ల మధ్య పొడచూపిన విభేదాలు మరింత తీవ్రతరమయ్యాయి. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఆయన నిన్న తన పదవికి రాజీనామా చేస్తూ నాలుగు పేజీల రాజీనామా లేఖను సీఎంకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదని, ఎన్నిసార్లు అడిగినా సీఎం నిధులు కేటాయించలేదని ఆరోపించారు.

పేదలకు ఇళ్ల నిర్మాణం అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన హామీ అని ఈ సందర్భంగా సింగ్‌దేవ్ గుర్తు చేశారు. మరికొన్ని విషయాల్లోనూ ఆయన సొంత ప్రభుత్వం తీరును నిరసించారు. కాగా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి తప్పుకున్న ఆయన.. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య, 20 సూత్రాల అమలు, జీఎస్టీ శాఖల మంత్రిగా మాత్రం కొనసాగనున్నారు.

ముఖ్యమంత్రిగా బఘేల్ రెండున్నరేళ్ల కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండో సగంలో తాను ముఖ్యమంత్రిగా ఉండాలని సింగ్‌దేవ్ భావిస్తున్నారు. ఈ విషయమై చత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరగడంతో స్పందించిన అధిష్ఠానం గతేడాది ఆగస్టులో సీఎంను, మంత్రిని ఢిల్లీకి పిలిపించి రాజీకుదిర్చింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య విభేదాలు అలానే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా సింగ్‌దేవ్ రాజీనామా చేయడం మరోమారు చర్చనీయాంశమైంది. ఆయన రాజీనామాపై స్పందించిన బీజేపీ చత్తీస్‌గఢ్ అధ్యక్షుడు విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ.. సింగ్‌దేవ్ రాజీనామా సీఎం బఘేల్ నియంతృత్వ పోకడలకు నిద్శనమని విమర్శించారు. సింగ్‌దేవ్ తన మిగతా పదవులకు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News