ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపి ఆత్మహత్యకు పాల్పడిన ఐటీబీపీ జవాను

  • జమ్మూ కశ్మీర్ లో ఘటన
  • కాల్పుల్లో ఓ హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
  • అక్కడికక్కడే మృతి చెందిన జవాను
జమ్మూకశ్మీర్ లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగానికి చెందిన ఓ జవాను ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఉధమ్ పూర్ జిల్లా దేవికా ఘాట్ కమ్యూనిటీ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన జవానును భూపేంద్ర సింగ్ గా గుర్తించారు. ఈ కాల్పుల ఘటనలో ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాణాపాయం లేదని ఓ అధికారి తెలిపారు. 

వారిపై ఇన్సాస్ రైఫిల్ తో కాల్పులు జరిపిన జవాను భూపేంద్ర సింగ్, ఆపై తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు 8వ బెటాలియన్ కు చెందినవాడు. ఇటీవలే ఎఫ్ కంపెనీకి చెందిన రెండో అడ్ హాక్ బెటాలియన్ కు డిప్యుటేషన్ పై వచ్చాడు. కాగా, అతడు ఎందుకు సహచరులపై కాల్పులు జరిపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై ఐటీబీపీ విచారణ (కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ)కు ఆదేశించింది.


More Telugu News