రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు: టీఆర్ఎస్ నేతలపై విజయశాంతి ధ్వజం

  • భూదాన్ భూములను ఆక్రమించుకుంటున్నారన్న విజయశాంతి
  • రికార్డుల నుంచి మాయం చేసే కుట్ర జరుగుతోందని వెల్లడి
  • కేసీఆర్ ఆటలు ఎంతోకాలం సాగవని హెచ్చరిక
  • తెలంగాణ సమాజం తగిన గుణపాఠం చెబుతుందని స్పష్టీకరణ
కేసీఆర్ పాలన ఆక్రమణలకు అడ్డాగా మారిందని తెలంగాణ బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ఎక్కడ చూసినా అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని, రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భూదాన్ భూములతో పాటు, ప్రాజెక్టుల నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు సేకరిస్తున్న భూములను సైతం రికార్డుల నుంచి మాయం చేసే కుట్ర చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. పేదలకు ఇచ్చిన భూదాన్ భూములకు పట్టాలు ఇప్పించేందుకు ఏకంగా సీసీఎల్ఏ స్థాయిలోనే పైరవీలు చేస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ అక్రమాలకు సహకరించని అధికారులపై ఇటీవల బదిలీ వేటు పడుతోందని వివరించారు. 

దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ, చింతపల్లి మండలాల్లో జరిగిన భూదందాలో వేలకోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. చింతపల్లి మండలం కుర్మేడులోని సర్వే నెం.247లో భూదాన్ భూములు ఉన్నాయని, అయితే ఆ భూములు ధరణి వెబ్ సైట్ లో కనిపించకుండా నిషేధిత జాబితాలో చేర్చారని విజయశాంతి వివరించారు. ఆ భూముల సర్వే నెంబరు సీసీఎల్ఏ రికార్డుల్లో లేకపోవడంతో పథకం ప్రకారం ఎన్ఓసీ తెప్పించి, ఆ ఫైల్ ను చింతపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయానికి పంపారని వెల్లడించారు. 

సీసీఎల్ఏ నుంచి ఎన్ఓసీ ఉండడంతో ఈ సర్వే నెంబరులో భూముల రిజిస్ట్రేషన్ కు పచ్చజెండా ఊపారని విజయశాంతి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ భూముల్లో రియల్టర్లు భారీగా వెంచర్లు వేస్తున్నారని తెలిపారు. 

అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములను ఇలాగే ఆక్రమించుకుంటున్నారని ఆమె వివరించారు. కేసీఆర్ అక్రమాల ఆటలు ఇంకెంతో కాలం సాగవని ఆమె హెచ్చరించారు. త్వరలోనే తెలంగాణ సమాజం కేసీఆర్ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు.


More Telugu News