ఏటిగ‌ట్టు పటిష్ఠత ప‌నుల్లో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల‌... వీడియో ఇదిగో

  • వ‌ర‌ద ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌లో నిమ్మ‌ల రామా నాయుడు
  • ఏటిగ‌ట్టు పటిష్ఠత ప‌నుల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శ‌
  • ప్ర‌భుత్వంలో చ‌ల‌నం కోసం ప‌నిచేశాన‌ని వెల్ల‌డి
నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండే ప్ర‌జా ప్ర‌తినిధుల్లో టీడీపీ సీనియర్ నేత, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామా నాయుడు ముందు వ‌రుస‌లో ఉంటార‌ని చెప్పాలి. కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా పాల‌కొల్లు ప‌రిధిలోని చాలా గ్రామాలు నీట మునిగాయి. ఆయా గ్రామాల్లోని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇస్తూ వ‌ర‌ద నీటిలోనే శుక్రవారం ప‌ర్య‌ట‌న సాగించిన నిమ్మ‌ల‌... తాజాగా ఏటిగ‌ట్టు పటిష్ఠత ప‌నుల్లో స్వ‌యంగా పాలుపంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ట్రాక్ట‌ర్‌లో ఏటిగ‌ట్టు దాకా వ‌చ్చిన ఇసుక బ‌స్తాల‌ను భుజంపై తీసుకుని వెళ్లిన నిమ్మ‌ల‌... వాటిని గ‌ట్టుపై వేశారు. ఆపై బ‌స్తాల‌ను త‌న అనుచ‌రులు తీసుకువ‌స్తుంటే.. వాటిని అందుకుని గ‌ట్టుపై వేస్తూ క‌నిపించారు. ఈ మేర‌కు ఈ ప‌నుల్లో పాలుపంచుకున్న నిమ్మ‌ల వీడియో ఇప్పుడు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 

గోదావరి వరదలకు ముందు జాగ్రత్తగా వేసవిలోనే  ఇసుక బస్తాలు, సర్వీబాదులు, తడికలు వంటి అత్యవసర సామాగ్రికి టెండరు పిలిచి సర్వ సన్నద్ధంగా ఉండవలసిన ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతోంద‌ని ఈ సంద‌ర్భంగా నిమ్మ‌ల ఆరోపించారు. ప్రభుత్వ చలనం తీసుకురావ‌డం కోస‌మే తాను ఇలా స్వ‌యంగా ఏటిగ‌ట్టు పటిష్ఠత ప‌నుల్లో పాలుపంచుకోవాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News